కేటీఆర్ ర్యాలీకి యువత నుంచి అద్భుతమైన స్పందన

కేటీఆర్ ర్యాలీకి యువత నుంచి వచ్చిన అద్భుతమైన స్పందన చూసి బీజేపీ, కాంగ్రెస్ నాయకులకు భయం పట్టుకుందని, వారి లాగులు తడిసిపోయాయని బిఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షులు శ్రీ చల్లా హరిశంకర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రతిపక్ష నాయకుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

“కేటీఆర్ ను విమర్శించే స్థాయి సునీల్ రావుకు లేదు. కేటీఆర్ కాలి గోటికి కూడా సునీల్ రావు సరిపోడు,” అని చల్లా హరిశంకర్ ఘాటుగా విమర్శించారు. సునీల్ రావుకు మేయర్ హోదా ఇచ్చిందే బీఆర్ఎస్ పార్టీ అని గుర్తుచేశారు. అధికారం కోసం పార్టీలు మారే చరిత్ర సునీల్ రావుదని, దొడ్డిదారిన పదవి పొంది కోట్లు సంపాదించాడని ఆరోపించారు. కరీంనగర్ రాజకీయాల్లో సునీల్ రావుకు ‘ఊసరవెల్లి’గా పేరుందని ఎద్దేవా చేస్తూ, ఊసరవెల్లి సునీల్ రావు పట్ల బండి సంజయ్ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. అత్యంత అవినీతి పరుడు ఎవరని గూగుల్‌లో వెతికితే సునీల్ రావు పేరే వస్తుందని, సునీల్ రావు ఉడుం సొచ్చినట్లు బీజేపీలో సొచ్చిండు కాబట్టి, బీజేపీ నాయకులు కూడా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. “బీఆర్ఎస్ నేతలను విమర్శిస్తే ఖబడ్దార్… సునీల్ రావు నీ ఇంటిని ముట్టడిస్తాం,” అని హెచ్చరించారు. స్మార్ట్ సిటీలో బండి సంజయ్ పాత్ర లేదని బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు విమర్శించిన విషయం సునీల్ రావు మరిచిపోయావా అని ప్రశ్నించారు. కరీంనగర్ అభివృద్ధి మాజీ ఎంపీ వినోద్ కుమార్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారి తోనే సాధ్యమైందని స్పష్టం చేశారు.

“బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే కరీంనగర్ అన్నివిధాల అభివృద్ధి చెందిన విషయం మంత్రి పొన్నం ప్రభాకర్ గారు గమనించాలి,” అని చల్లా హరిశంకర్ అన్నారు. గత 15 నెలల కాలంలో మంత్రిగా పొన్నం ప్రభాకర్ గారు కరీంనగర్‌కు ఏం చేశారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. తమ హయాంలో జరిగిన అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎక్కడికక్కడ ఆగిపోయిందని విమర్శించారు.

కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఒక కార్పొరేటర్ లా మాట్లాడారని చల్లా హరిశంకర్ ఎద్దేవా చేశారు. కేసీఆర్‌కు దొంగ నోట్ల ప్రింటింగ్ ప్రెస్ ఉందని బండి సంజయ్‌కు ఎలా తెలిసిందని, అందులో పని చేశారా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి దగ్గర మెప్పు పొందేందుకే బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. బండి సంజయ్‌కు దమ్ముంటే కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల మీద మాట్లాడాలని సవాల్ విసిరారు.కేసీఆర్‌కు ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక కాంగ్రెస్, బీజేపీలు కలిసి డైవర్షన్ డ్రామాలు ఆడుతున్నాయని చల్లా హరిశంకర్ దుయ్యబట్టారు.