తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని మున్సిపాలిటీలు మరియు కార్పొరేషన్లలో ఆస్తి పన్నులపై ఉన్న వడ్డీ మాఫీ పథకాన్ని ప్రకటించాలని బీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షుడు శ్రీ చల్లా హరిశంకర్ గారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం రోజున కరీంనగర్లోని 37వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ నగర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ డిమాండ్ చేశారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జిహెచ్ఎంసి (GHMC) పరిధిలోని ఇళ్లకు మాత్రమే వడ్డీ మాఫీ పథకాన్ని ప్రభుత్వం ప్రకటించిందని చల్లా హరిశంకర్ పేర్కొన్నారు. మిగిలిన అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కూడా ఈ పథకాన్ని తక్షణమే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రస్తుత ఆర్థిక సంక్షోభ పరిస్థితుల్లో మధ్యతరగతి, సామాన్య ప్రజలు ఇంటి పన్నులు కట్టేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వడ్డీ మాఫీ పథకాన్ని ప్రకటించి వారికి ఊరట కల్పించాలని కోరారు.
నగరంలో సామాన్యులు, మధ్యతరగతి ఇంటి యజమానులపై ఒత్తిడి తీసుకొచ్చి ఇంటి పన్నులు వసూలు చేస్తున్న నగరపాలక అధికారులను చల్లా హరిశంకర్ ప్రశ్నించారు. లక్షల్లో బకాయిలు ఉన్న ప్రభుత్వ కార్యాలయాల నుంచి ఎందుకు పన్నులు వసూలు చేయడం లేదని నిలదీశారు. వెంటనే ప్రభుత్వ కార్యాలయాల నుంచి రావలసిన ఆస్తి పన్నులను వసూలు చేసేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. పన్నులు చెల్లించాల్సిన సామాన్య, మధ్యతరగతి యజమాన్యాలపై వడ్డీ మాఫీ పథకం వచ్చేవరకు ఒత్తిడి తీసుకురావద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
పన్నులు పకడ్బందీగా వసూలు చేసేందుకు ఆసక్తి చూపుతున్న అధికారులు, ఆయా ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారని చల్లా హరిశంకర్ విమర్శించారు. నగరంలో వీధి దీపాలు సరిగా వెలగడం లేదని, పారిశుద్ధ్యం కూడా అంతంత మాత్రంగానే ఉందని ఆరోపించారు. వేసవికాలం ప్రారంభానికి ముందే పలు కాలనీల్లో రోజు తప్పించి రోజు నీటి సరఫరా సాగుతోందని, రానున్న రోజుల్లో మరింత సమస్యలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు. నగరపాలక సంస్థ అధికారులు ఇంటి పన్ను వసూళ్ల విషయంలో పెట్టిన దృష్టి, మౌలిక సదుపాయాల కల్పన విషయంలో కూడా సారించాలని ఆయన కోరారు.
ఈ ప్రెస్ మీట్లో బీఆర్ఎస్ పార్టీ నగర యూత్ ప్రధాన కార్యదర్శి శ్రీ బోనకుర్తి సాయి కృష్ణ గారు, కరీంనగర్ నియోజకవర్గ యూత్ ప్రధాన కార్యదర్శి శ్రీ గంగాధర చందు గారు, బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు శ్రీ ఆరె రవి గౌడ్ గారు, శ్రీ చేతి చంద్రశేఖర్ గారు, శ్రీ జెల్లోజి శ్రీనివాస్ గారు, శ్రీ ఇర్ఫాన్ గారు, అలాగే బీఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రీ గుండెల్లి రాజకుమార్ గారు, శ్రీ ఒడ్నాల రాజు గారు, శ్రీ సత్తినేని శ్రీనివాస్ గారు, శ్రీ నయీమ్ గారు, శ్రీ నర్సింగా రావు గారు పాల్గొన్నారు.
Challa Harishankar జై మున్నూరుకాపు .. జై కరీంనగర్ .. జై తెలంగాణ