టీటీడీ ఆలయ నిర్మాణానికి అంకురార్పణ

గోవింద నామస్మరణతో కరీంనగర్ నగరం పులకించిపోయింది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో నగరంలో నిర్మించనున్న శ్రీవారి ఆలయ నిర్మాణ పనులకు మిథున లగ్నంలో భూకర్షణంతో అంకురార్పణ జరిగింది. కరీంనగర్ వాసులకు తిరుమల శ్రీవారి దర్శనం కల్పించాలనే లక్ష్యంతోనే ఈ క్షేత్రాన్ని నిర్మిస్తున్నామని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.

టీటీడీ ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో భూకర్షణ హోమం, కలశారాధన, అష్టదిక్పాలకుల పూజ, మండప పూజ, కన్యకాపూజ, గోపూజ, ముత్తైదువ పూజ నిర్వహించారు. అనంతరం శ్రీవారి గర్భాలయం నిర్మించే స్థలంలో నాగలితో దున్ని, నవధాన్యాలను వెదజల్లారు. ఈ క్రమంలో మంత్రి గంగుల కమలాకర్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్  , చల్ల హరిశంకర్ నాగలి పట్టుకుని దున్నగా, ముత్తైదువలు నవధాన్యాలను వెదజల్లారు. చివరగా మహా పూర్ణాహుతి, విశేష ఆశీర్వచన కార్యక్రమాలను నిర్వహించారు.