అస్తవ్యస్తంగా డివిజన్ల విభజన

కాంగ్రెస్ పాలనలో కరీంనగర్ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ రెవెన్యూ అధికారులు డీలిమిటేషన్‌ను శాస్త్రీయబద్ధంగా చేయలేదని బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ విమర్శించారు. బుధవారం స్థానిక 37వ డివిజన్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 60 డివిజన్లను 66 డివిజన్లుగా శాస్త్రీయత లేకుండా ముసాయిదా తయారు చేశారని ఆరోపించారు. ఇందుకోసం టౌన్ ప్లానింగ్ రెవెన్యూ అధికారులు చివరకు ఐఏఎస్ అధికారులను సైతం తప్పుదారి పట్టించారని ఆరోపించారు. దీని వెనుక ఎవరున్నారో అధికారులు చెప్పాలన్నారు. డివిజన్‌లలో లేని ఓట్లను కలిపి ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారని విమర్శించారు.

సాంకేతికత ఎంత పెరిగినా డివిజన్ల బౌండరీస్ సరిగ్గా ఏర్పాటు చేయలేదన్నారు. దీనిపై కేంద్రమంత్రి బండి సంజయ్ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌ సమాధానం చెప్పాలన్నారు. మున్సిపల్ అధికారులు ఏర్పాటు చేసిన ముసాయిదా జాబితా చూస్తే ఆశ్చర్యంగా ఉందన్నారు. టౌన్ ప్లానింగ్ అధికారులకు నగరంపై పట్టు లేనట్టుగా కనిపిస్తోందన్నారు. అధికారులు తయారు చేసిన తప్పుడు ముసాయిదా జాబితాపై ఐఏఎస్ అధికారులు గుడ్డిగా ఎలా సంతకం చేశారో అర్థం కావడం లేదన్నారు. ముసాయిదా జాబితాలో పారదర్శకత కొరవడిందన్నారు. వంద ఫీట్ల రోడ్డు.. 60 ఫీట్ల రోడ్లు హద్దులుగా డివిజన్లను విభజించాల్సి ఉన్నా ఎక్కడా పట్టించుకోలేదని విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో కరీంనగర్ గొప్ప నగరంగా అభివృద్ధి చెందిందన్నారు.