దళితజాతి సమగ్ర వికాసం కోసం ఇప్పటివరకు జరిగింది ఒక ఎత్తు, ఇప్పుడు జరగబోయేది ఒక ఎత్తు. గౌరవ కె.చంద్రశేఖర్ రావు ఆలోచనల వెలుగులో ఊపిరి పోసుకున్న ‘తెలంగాణ దళితబంధు పథకం’ దళితుల జీవితాల్లో విప్లవాత్మక మార్పునకు నాంది పలకనుంది. దళిత వాడల్లో నెలకొన్న దారిద్య్రాన్ని సమూలంగా పారదోలబోతున్నది. భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ మహాశయుడి ఆశయాలకు ప్రతిబింబమై, అణగారిన ప్రజల జీవితాల్లో నూతన క్రాంతిని సాధించబోతున్నది. దళితబంధు ఒక ఉద్యమం. భయంకరమైన దుర్విచక్షణ, దోపిడి ఫలితంగా ఇన్నాళ్లూ పేదరికంలో అణగారిన దళితజాతి- ఒక్క ఉదుటున తనకు తానుగా లేచి నిలబడి స్వశక్తితో, స్వావలంబనతో, ఆత్మగౌరవంతో జీవించాలనే మహాసంకల్పానికి ఆచరణ రూపమే తెలంగాణ దళితబంధు.
దళితజాతికి సంపూర్ణమైన ఆర్థిక, సామాజిక మద్దతును అందించేవిధంగా ఈ పథకం రూపుదాల్చింది. ఇది కేవలం ఒక సాధారణ సంక్షేమ పథకం కాదు. కుల దుర్విచక్షణ సృష్టించిన చీకట్లను ఛేదించి, వెలివాడలను వెలుగువాడలుగా మార్చే మహా ఉద్యమం . కేసీఆర్ గారు తరచూ చెబుతున్నట్లు దేశవ్యాప్తంగా ఏ ప్రాంతంలో చూసినా కడుపేదలు దళితులే. స్వాతంత్య్ర అమృతోత్సవాలు జరుపుకొంటున్న నేటి సందర్భంలోనూ దళితుల స్థితిగతులు పెద్దగా మారలేదు. ‘వీలయినంత తొందరగా ఆర్థిక సామాజిక అసమానతలను రూపుమాపకపోతే, మనం ఎంతో శ్రమించి రూపొందించుకున్న ప్రజాస్వామిక రాజ్యాంగ సౌధం కూలిపోతుంది’ అని అంబేడ్కర్ హెచ్చరించారు. దేశాన్ని పాలించిన రాజకీయ పార్టీలు అణగారిన జాతుల అభివృద్ధి కోసం నిజాయతీగా ఎన్నడూ ప్రయత్నించలేదు. కొద్దిగా భూమి, కొద్దిమొత్తంలో రుణాలూ అంతే. అంతకు మించి లేదు. ఓట్ల రాజకీయం కోసం విదిల్చిన ఈ కొద్దిపాటి విదిలింపులవల్ల తరతరాలుగా తపిస్తున్న దళితుల ఆర్తి తీరలేదు. పరిస్థితి మారలేదు.
దళితబంధు పథకం కింద ఉపాధి ఎంపికలో ప్రభుత్వం కేవలం మార్గదర్శనం మాత్రమే చేస్తుంది. పదిలక్షల రూపాయలను ఏ విధంగా ఉపయోగించుకోవాలనే అయోమయానికి గురికాకుండా ప్రభుత్వాధికారులు, స్వచ్ఛంద సేవకులు పాత్ర వహిస్తారు. అంతిమంగా ఎంపిక నిర్ణయం లబ్ధిదారుడిదే. తాను ఏ పనిని అల్కగ చేసుకోగలనని భావిస్తాడో అదే పనిని అతడు ఎంచుకోవచ్చు. ఈ పెట్టుబడి మొత్తం సద్వినియోగమయ్యే విధంగా ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తుంది. ఇందుకోసం ప్రజలు, అధికారుల భాగస్వామ్యంతో గ్రామ, మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలు ఏర్పాటవుతాయి. లబ్ధిదారులకు అధికారులు, దళిత బస్తీల్లో ఉండే చైతన్యవంతులు నిరంతరం తగిన సలహాలు సూచనలను అందిస్తారు. అడుగడుగునా ప్రజల భాగస్వామ్యంతో పథకం కొనసాగుతుంది. లబ్ధి పొందిన కుటుంబం కాలక్రమంలో ఏదైనా ఆకస్మిక ప్రమాదానికి లోనైతే దళితబంధు పథకం ఒక రక్షక కవచంగా ఆ కుటుంబాన్ని కాపాడాలని కేసీఆర్ ఆలోచించారు. ఇందుకోసం ఈ పథకంలో ‘రక్షణ నిధిని’ భాగం చేశారు. ఈ నిధి కోసం లబ్ధిదారులు ఒక్కొక్కరు పదివేల రూపాయల చొప్పున జమచేస్తారు. ఆ మొత్తానికి సమాన మొత్తాన్ని ప్రభుత్వం జమ చేస్తుంది. ఆపద పాలైన కుటుంబాలకు ఈ రక్షణనిధి నుంచి తక్షణం ఆర్థిక సహాయం అందుతుంది.
Challa Harishankar జై మున్నూరుకాపు .. జై  కరీంనగర్ .. జై  తెలంగాణ