కలెక్టర్‌కు చల్ల హరిశంకర్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేత

కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో ప్రకటించిన డివిజన్ల పునర్విభజన ప్రక్రియపై బీఆర్ఎస్ పార్టీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఈరోజు బీఆర్ఎస్ నగర అధ్యక్షులు శ్రీ చల్ల హరిశంకర్ గారి ఆధ్వర్యంలో పార్టీ నాయకుల బృందం జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేల సత్పతిని కలిసి, లోపభూయిష్టంగా ఉన్న ఈ విభజన ప్రక్రియపై వినతిపత్రం అందజేసింది.

కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కొత్తగా కలిసిన గ్రామపంచాయతీలను కలుపుకొని ఏర్పడిన నగరంలోని డివిజన్ల పునర్విభజన లోపభూయిష్టంగా ఉందని, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఉందని బీఆర్ఎస్ నాయకులు కలెక్టర్‌కు విన్నవించారు. మున్సిపల్ రెవెన్యూ, టౌన్ ప్లానింగ్ అధికారుల పనితీరులో తీవ్ర లోపాలను ఈ సందర్భంగా వివరించారు. సంబంధిత ప్లానింగ్, రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో సందర్శించకుండా, విభజనను భౌగోళిక నైసర్గిక స్వరూపంలో కాకుండా కేవలం ఇంటి నెంబర్ల వారీగా కాగితాలపైనే ప్రక్రియ కొనసాగించారని ఆరోపించారు.

స్థానిక ప్రజల జీవన విధానాలపై ఎలాంటి అవగాహన లేకుండా, ప్రజలు, ప్రజాప్రతినిధులను సంప్రదించకుండా విభజించడం కరీంనగర్ అస్తిత్వాన్ని విచ్ఛిన్నం చేసే విధంగా ఉందని చల్లా హరిశంకర్ అన్నారు. ఇలా విభజించడం వలన మానవ సంబంధాల మధ్య విభేదాలు ఏర్పడటంతో పాటు, మౌలిక సదుపాయాల నిర్వహణ, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య పనుల నిర్వహణ, విద్యుద్దీపాల ఏర్పాటు, అభివృద్ధి పనులలో తారతమ్యాలు తలెత్తి ప్రజలకు తరచూ ఇబ్బందులు ఉంటాయని వివరించారు.

ఓటర్ల సంఖ్యలో భారీ తేడాలు, నిబంధనల ఉల్లంఘన: నగర పాలక సంస్థ ప్రకటించిన 66 డివిజన్లలో తెలిపిన ఇంటి నెంబర్లకు సంబంధించిన ఓటర్ల సంఖ్య పూర్తిగా అసంబద్ధంగా ఉందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. అసలైన ఓటర్ల సంఖ్య సుమారు 3,35,592 గా లెక్కలు చూపినప్పటికీ, డివిజన్ల వారీగా చూపించిన ఓటర్ల జాబితాలో చాలా తేడాలు ఉన్నాయని స్పష్టం చేశారు. ప్రతి డివిజన్‌లో ఐదు వేల ఓటర్లు ఉండే విధంగా చూపించినప్పటికీ, కొన్ని డివిజన్లలో 2000 మరియు 3000 మాత్రమే ఓటర్లు ఉండగా, మరికొన్ని డివిజన్లలో 7000 మరియు 8000 ఓటర్లు ఉన్నాయని తెలిపారు. ఇవేవి కూడా పట్టించుకోకుండా మున్సిపల్ రెవెన్యూ అధికారులు, టౌన్ ప్లానింగ్ అధికారులు వారి ఇష్టానుసారంగా డీలిమిటేషన్ ప్రక్రియ చేశారని విమర్శించారు. ఇట్టి డీలిమిటేషన్ పై వెంటనే విచారణ జరిపించి, తప్పుడు సమాచారంతో కరీంనగర్ నగరంలో ఉన్న ప్రజలను, నాయకులను ఆందోళనకు గురిచేసిన అధికారులపై చర్య తీసుకోవాలని విన్నవించారు.

సంబంధిత డివిజన్ల విభజన ప్రక్రియ చేపట్టడానికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం 100 అడుగుల (ఫీట్ల) రోడ్డుకు ఇరువైపులా ఒకే డివిజన్ ఉండటం సరికాదని, అయినప్పటికీ చాలా డివిజన్లలో 100 అడుగుల రోడ్డుకు ఇరువైపులా ఒకే డివిజన్ వచ్చేలా అధికారులు ప్రక్రియ నిర్వహించారని, ఇది నియమావళికి పూర్తిగా విరుద్ధమని కలెక్టర్‌కు విన్నవించారు.

ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ పార్టీ మాజీ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ పార్టీ డివిజన్ ఇంచార్జులు, బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నగరంలో న్యాయబద్ధమైన, పారదర్శకమైన డివిజన్ల పునర్విభజన జరగాలని వారు డిమాండ్ చేశారు.