మానేరు రివర్ ఫ్రంట్ పనులను అడ్డుకునేందుకు కుట్ర

కరీంనగర్ ప్రతిష్టాత్మక మానేరు రివర్ ఫ్రంట్ పనులను ఆపేందుకు బిజెపి మరియు కాంగ్రెస్ పార్టీలు కుట్రలు చేస్తున్నాయని బీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షులు శ్రీ చల్లా హరిశంకర్ తీవ్రంగా మండిపడ్డారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, మానేరు నది కరీంనగర్ ను ఆనుకొని ప్రవహించడం నగరానికి ఒక గొప్ప ఆస్తి (asset) అని అభివర్ణించారు.

కరీంనగర్‌ను పర్యాటకంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు, మాజీ మంత్రులు శ్రీ కె.టి. రామారావు, శ్రీ గంగుల కమలాకర్, మరియు మాజీ ఎంపీ శ్రీ బోయినిపల్లి వినోద్ కుమార్ లు విశేష కృషి చేశారని చల్లా హరిశంకర్ గుర్తుచేశారు. వారి చొరవతోనే రూ. 542 కోట్లను మంజూరు చేసి మానేరు రివర్ ఫ్రంట్ పనులను ప్రారంభించారని, బోయినిపల్లి వినోద్ కుమార్, గంగుల కమలాకర్ ల పర్యవేక్షణలో పనులు సాఫీగా సాగాయని అన్నారు.

అయితే, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే, అవినీతి జరిగిందని ఆరోపిస్తూ పనులను నిలిపివేశారని చల్లా హరిశంకర్ విమర్శించారు. మానేరు రివర్ ఫ్రంట్ కోసం కేటాయించిన నిధులతో పనులను పూర్తి చేయాలని మాజీ మంత్రివర్యులు, ప్రస్తుత శాసనసభ్యులు శ్రీ గంగుల కమలాకర్ గారు అసెంబ్లీలో గళం విప్పడంతో, స్పందించిన కాంగ్రెస్ పాలకులు మళ్లీ పనులను ప్రారంభించారని తెలిపారు. ఇప్పుడు ఈ పనులను అడ్డుకునేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని ఆయన ఆరోపించారు.

కరీంనగర్ మాజీ మేయర్ ఊసరవెల్లి సునీల్ రావు కమీషన్ల కోసం మానేరు రివర్ ఫ్రంట్ కాంట్రాక్టర్ దగ్గర బ్లాక్ మెయిల్ బెదిరింపులకు పాల్పడుతున్నాడని చల్లా హరిశంకర్ తీవ్ర ఆరోపణలు చేశారు. కరీంనగర్ మేయర్‌గా ఆయన చరిత్ర మొత్తం అవినీతిమయమేనని, మేయర్ పదవి పోయి కలెక్షన్లు రాకపోవడంతో ఇప్పుడు మానేర్ రివర్ ఫ్రంట్‌పై పడ్డాడని విమర్శించారు. మానేరు రివర్ ఫ్రంట్‌లో అవినీతి జరిగిందని అంటున్న సునీల్ రావు, తాను మేయర్‌గా ఉన్నప్పుడు అవినీతి కనిపించలేదా అని ప్రశ్నించారు. పదవ తరగతి ఫెయిల్ అయిన సునీల్ రావు మానేరు రివర్ ఫ్రంట్ డిజైన్‌పై మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. రివర్ ఫ్రంట్ డిజైన్ చేసింది నిష్ణాతులైన ఇంజనీర్లు, ఇతర అధికారులు అని, వారి ముందు సునీల్ రావు ఎంత అని నిలదీశారు.

కాంగ్రెస్, బీజేపీలు ఎంత ప్రయత్నించినా, రివర్ ఫ్రంట్ నిర్మించిన కీర్తి బీఆర్ఎస్‌కే తప్ప వారికి రాదని చల్లా హరిశంకర్ స్పష్టం చేశారు. సునీల్ రావుకు కరీంనగర్ అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉంటే, రివర్ ఫ్రంట్ కోసం కేంద్ర మంత్రి బండి సంజయ్ సహకారంతో మరో 200 కోట్లు అదనంగా తీసుకురావాలని సవాల్ విసిరారు. సునీల్ రావుకు దమ్ముంటే మానేరును ఆనుకొని ఉన్న డంపింగ్ యార్డును తరలించాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్ నిన్ను గెలిపించిన ప్రజల రుణం తీర్చుకోవాలంటే నగరానికి కొత్తగా ఏమైనా తీసుకురావాలని సూచించారు. రివర్ ఫ్రంట్ కోసం కేంద్రం 200 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం 200 కోట్లు కేటాయించాలని ఆయన కోరారు. బండి సంజయ్, ఊసరవెల్లి సునీల్ రావుతో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కరీంనగర్ మున్సిపాలిటీలోని 50 స్థానాలకు పైగా బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని, కరీంనగర్ బల్దియాపై మూడవసారి గులాబీ జెండాను ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేశారు. సునీల్ రావును కరీంనగర్ ప్రజలు నమ్మడం మానేశారని ఆయన స్పష్టం చేశారు. చివరగా, మానేరు రివర్ ఫ్రంట్ ను పూర్తి చేసేందుకు మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ప్రత్యేక చొరవ తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.