కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు ఖండించిన చల్ల హరిశంకర్

బీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షుడు శ్రీ చల్లా హరిశంకర్ గారు ఈరోజు కరీంనగర్‌లోని నక్షత్ర హోటల్‌లో జరిగిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన, మన ప్రియతమ నాయకులు, తెలంగాణ ఉద్యమ ప్రదాత, మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారిపై కేంద్ర మంత్రి, కరీంనగర్ ఎంపీ శ్రీ బండి సంజయ్ చేసిన అనుచిత, వ్యక్తిగత వ్యాఖ్యలను, వారి అహంకార పూరిత శైలిని తీవ్రంగా ఖండించారు.

అదేవిధంగా, శ్రీ బండి సంజయ్ గారు మన కాళేశ్వరం ప్రాజెక్టుపై, బీఆర్ఎస్ పార్టీపై చేసిన నిరాధారమైన, బాధ్యతారహితమైన ఆరోపణలను కూడా చల్లా హరిశంకర్ గారు తీవ్రంగా ఖండించారు. వాస్తవాలు తెలుసుకోకుండా, కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఇలాంటి అవాస్తవ ఆరోపణలు చేయడం దురదృష్టకరమని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రజల ఆశలను, ఆకాంక్షలను నెరవేర్చిన కేసీఆర్ గారిపై ఇలాంటి అసభ్యకర వ్యాఖ్యలు చేయడం క్షమించరాని నేరమని ఆయన అన్నారు.

బండి సంజయ్ గారు తమ పద్ధతిని మార్చుకోవాలని చల్లా హరిశంకర్ గారు సూచించారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలను విరమించుకొని, వాస్తవాలను, అభివృద్ధిని గుర్తించి మాట్లాడాలని ఆయన హెచ్చరించారు. వారి మాటలు యువతకు, ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ ప్రజా సమస్యలపై నిబద్ధతతో పనిచేస్తుందని, అవాస్తవ ప్రచారాలను తిప్పికొట్టడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు.